లిక్కర్ కుంభకోణంలో (Delhi Liquer scam) అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Cm kejiriwal) ప్రస్తుతం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారుల కస్టడీ ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆయనకు వారం రోజుల పాటు కస్టడీ విధించింది. అంతకుముందు లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ కేజ్రీవాల్ అని ఆయన్ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
ఆయన్ను కస్టడీకి అప్పగిస్తే మరింత లోతుగా విచారంచడానికి అవకాశం ఉంటుందని, ఫలితంగా లిక్కర్ కుంభకోణంలో పురోగతి దొరుకుతుందని ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు వారం రోజుల పాటు కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఆయన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ కూడా వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన తీర్పు రిజర్వులో ఉంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు. దానిని ఆయన భార్య సునీత వీడియో సందేశం ద్వారా బహిర్గత పరిచారు. ‘ఈ అరెస్టు నన్నేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఈ సమయంలో మీ నుంచి (ఢిల్లీ ప్రజలు, పొలిటికల్ పార్టీలు) ఎంతో ప్రేమ లభించింది. ఈ దేశాన్ని నంబర్ వన్ చేయడమే నా ఏకైక లక్ష్యం. అందుకు ఇక్కడున్న దుష్టశక్తులను ఓడించాలి.
బయట ఇలాంటి శక్తులు చాలా ఉన్నాయి. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటా.. ఢిల్లీ మహిళలు నేను కటకటలా వెనుక ఉన్నారని అనుకుంటున్నారు. కానీ రూ.1000 హామీని తప్పకుండా అమలు చేసి తీరుతా.. ఏ జైలు నన్ను ఎక్కువ రోజులు బంధించి ఉంచలేదు. త్వరలోనే మీ ముందుకు వస్తా.. మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా.. నాకోసం ప్రార్థించండి’ అంటూ కేజ్రీవాల్ రాసిన లేఖలోని సారాంశాన్ని ఆమె భార్య చదివి వినిపించారు.