ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్ జైలు(Tihar jail)లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్(CM Kejiriwal)కు మరోసారి చుక్కెదురు అయ్యింది. గతంలో రౌస్ అవెన్యూ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remand) సోమవారంతో ముగియనుంది.
ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కోర్టు అనుమతి ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రిని వర్చువల్గా విచారణకు హాజరు పరిచారు. న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజా ఆయనకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగిస్తూ తీర్పు చెప్పింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. మరోవైపు తన అరెస్టు, విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టీస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం
తాజాగా ఈడీకి నోటీసులు జారీచేసింది.
ఈనెల 24లోపు ఆ పిటిషన్పై స్పందించాలని అందులో సూచించింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కావాలనే ఈడీ తన క్లైయింట్ను వేధిస్తోందని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.