కొన్ని వారాలుగా తూర్పు ఆఫ్రికా(Africa) దేశం కెన్యా(Kenya) రాజధాని నైరోబీ, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు(heavy Floods) బీభత్సం సృష్టించాయి. కెన్యా పూర్తిగా వరదలతో అల్లకల్లోలంగా మారుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా మార్చిలో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలలో ప్రకటించిన చివరి నివేదిక కంటే రెట్టింపు మరణాలు నమోదయ్యాయి.
కెన్యాలో తూర్పున ఉన్న మకుని కౌంటీలోని నది నుంచి శుక్రవారం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తులు లారీలో ప్రయాణిస్తుండగా గల్లంతైనట్లు గుర్తించారు. వంతెనపై నుంచి వెళ్తున్న లారీ వరదలకు మునిగిపోయి కొట్టుకుపోయింది. అయితే లారీలో ఉన్న 11మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు రాజధానిలోని దాదాపు 64 ప్రభుత్వ పాఠశాలలు ముంపునకు గురై మూతపడ్డాయి.
రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కెన్యా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 64 ప్రభుత్వ పాఠశాలల్లో వరద అత్యవసర సహాయ చర్యల కోసం ప్రభుత్వం 4 బిలియన్ కెన్యా షిల్లింగ్లను 29మిలియన్ డాలర్లను కేటాయించినట్లు వైస్ ప్రెసిడెంట్ రిగతీ గచాగువా శుక్రవారం తెలిపారు. కెన్యాలో ప్రస్తుతం ఈ వరదల తాకిడికి లక్షా 30వేల మంది ప్రభావితులయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అయితే వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని కెన్యా ప్రభుత్వ ప్రతినిధి ఐజాక్ మవౌరా ఖండించారు. ఇప్పటి వరకు మృతిచెందింది 70మంది మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కెన్యా పొరుగు దేశమైన టాంజానియాలో వరదలతో 155 మంది మృతిచెందారు. బురుండిలో 2లక్షల కంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యారు.