ఎగిరెగిరి పడుతున్న కొడాలి నానికి అంకుశం సినిమాలో చార్మినార్ వద్ద రామిరెడ్డికి పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) అన్నారు. మంత్రి రోజా (Minister Roja), మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani), ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు బాధ్యతారహిత్యాంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సైకో సీఎం జగన్ కళ్లల్లో పైశాచిక ఆనందం కోసం కొడాలి నాని, రోజా హద్దు మీరి మాట్లాడుతున్నారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రజలు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఎమ్మేల్యే వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటి దాకా నోరు మెదపకుండా కూర్చున్న విషయం మర్చిపోయావా అని అన్న దేవినేని ఉమా, వేయి కోట్లు పోయాయాని ప్రచారం చేసుకున్న వసంత కృష్ణప్రసాద్, రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చాడా, వ్యాపారం చేసుకోడానికి వచ్చాడా అని ప్రశ్నించారు. మట్టి, ఇసుక, కొండపల్లి గ్రావెల్ అమ్ముకొని వందల కోట్లు దోచుకున్నాడని వసంత కృష్ణప్రసాద్ ను విమర్శించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మైలవరంలో టీడీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని దేవినేని ఉమా సందర్శించారు. నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు.