విజయవాడ దుర్గగుడి (Durga Temple) లో సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ (Over Action) చేశారు. గుడి పైకి లిఫ్ట్ (Lift) లో వెళ్తున్న మహిళలను బలవంతంగా కిందకు దించేశారు. దీంతో మహిళలకు సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయినా సరే మహిళలను లిఫ్ట్ ఎక్కనివ్వలేదు. అసలేం జరిగిందంటే…
దుర్గగుడికి పైకి వెళ్లేందుకు భక్తులను లిప్ట్ సౌకర్యం ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు వంటి వారికి ఈ సౌకర్యం కల్పిస్తారు. లిప్ట్ ను పర్యవేక్షించేందుకు కొందరు సెక్యూరిటీ సిబ్బంది షిప్ట్ ల్లో విధులు నిర్వహిస్తుంటారు.
ఇవాళ కొందరు మహిళలు లిఫ్ట్ ఎక్కేతే వారిని సెక్యూరిటీ సిబ్బంది కిందకు దించేశారు. దుర్గగుడి పాలక మండలి ఛైర్మెన్ రాంబాబు వస్తున్నారని, అతని కోసం కొందరు భక్తులు లిఫ్ట్ దిగిపోవాలని సెక్యూరిటీ సిబ్బంది మహిళలను కోరారు. దానికి మహిళలు అంగీకరించలేదు. దీంతో వారిని బలవంతంగా లిఫ్ట్ నుంచి దించేశారు సెక్యూరిటీ సిబ్బంది.
దీంతో ఆగ్రహించిన మహిళలు ఛైర్మెన్ కోసం మహిళలను ఇబ్బంది పెడతారా అంటూ నిరసన తెలియజేశారు. అయినా… అదేమి పట్టించుకోకుండా లిప్ట్ లోకి మాత్రం మహిళలను అనుమతించలేదు. వందల కిలోమీటర్ల దూరం నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన తమకి ఇంతటి అవమానం చేస్తారా? అంటూ భక్తులు నిరసన తెలిపారు.
లిప్ట్ సౌకర్యం వాడుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది కొందరు వద్ద డబ్బులు కూడా తీసుకుంటున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. పైగా ఉచితంగా లిప్ట్ సౌకర్యం వినియోగించుకునే అవకాశమున్న వృద్ధులు, వికలాంగులు అనే కనికరం లేకుండా వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.