అక్టోబరు 3 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నిజామాబాద్ (Nijamabad) జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తరపున పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్దాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభ లో మోడీ పాల్గొంటారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.
ప్రధాని పర్యటన సందర్భంగా ఎన్టీపీసీకి సంబంధించిన 6 వేల కొట్ల విలువైన పెట్టుబడుల కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అలాగే 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభిచనున్నారు. ఈ కార్యక్రమాలు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజి మైదానలో జరుగుతాయి. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా మారనుందని కిషన్ రెడ్డి మీడియాతో చెప్పారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రియాశీలకంగా ఉంటుందనీ ఈ ప్రాంతంలో బీజేపీది కీలక పాత్రనీ కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో కూడా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అమిత్ షా, నడ్డా తో పాటు పలువురు ప్రముఖులు కూడా పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి తెలంగాణలో ఎన్నికల సన్నాహలు షురూ అవుతున్నాయని బీజేపీ ఇప్పటికే తెలిపింది.
తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేరుకే కేసీఆర్ సీఎం కానీ షాడో సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తామిచ్చిన హామీ లపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం బీజేపీకి లేదన్నారు. ఉద్యోగనియామకాల కోసం 17 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటని, ప్రభుత్వంపై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్సీల పై గవర్నర్ నిర్ణయం సరైనదేనని కిషన్ రెడ్డి చెప్పారు. అర్హతలేకపోయినా పదవులువ్వడం కేసీఆర్ కే చెల్లిందని, అనర్హులకు పదవులు కట్టబెట్టడం దారుణమని ఆరోపించారు.