స్థానికతకు సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలతో ఏడుగురు విద్యార్థులు కాళోజీ హెల్త్ యూనివర్సటీ (Kaloji Health University) లో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. ఈ విషయం బయటపడటంతో వీరి సీట్లను యూనివర్సిటీ రద్దు చేసి, వీరిపై కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ స్థానిక కోటా (Local Quota) లో సీట్లు పొందేందుకు ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థులు (Students) ఈ నకిలీ ధృవప్రతాలను సృష్టించారు.
ఈ దందాకు సూత్రధారి అయిన కన్సల్టెంట్ నిర్వాహకుడు కామిరెడ్డి నాగేశ్వరరావుపై వరంగల్ మట్టెవాడ పోలీసుస్టేషన్లో సెప్టెంబరు 29న కేసు నమోదైంది. ఇతనితో పాటు ఆంధ్రప్రదేశు చెందిన విద్యార్థులు పోపులు సుబ్రహ్మణ్యసాయి తేజ, వానిపెంట సాయి ప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజారెడ్డి, తన్నీరు సంజయ్, అరికట్ల హనుమాన్రెడ్డి, టేకులపల్లి మహేశ్, గేర్లె భార్గవ్ ధర్మతేజ యశ్వంత్ నాయుడులపై కూడా కేసు నమోదు చేశారు.
2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో సీట్లు పొందిన ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది. వీరంతా 6 నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినట్లు ధ్రువపత్రాలు పొందుపరిచారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు. దీంతో వీరంతా స్థానిక కోటాలో సీట్లు పొందారు.
కానీ, వీరు టెన్త్, ఇంటర్ ఏపీలో చదివారు. నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాయడంతో అధికారులు అనుమానం వచ్చింది. దీనిపై అదికారులు విద్యార్థుల వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్తూ…విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా ధ్రువపత్రాలు పొందుపరిచారని అధికారులకు తెలిపారు. దీంతో ఈ ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన వర్సిటీ.. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.