రానున్న రెండు రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పలు చోట్ల చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
ఏపీలో వర్షాలు…
ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19న బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.
తెలంగాణాలో వర్షాలు, వేడి…
పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణాలో పలు చోట్ల ఇవాళ వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ చాలా చోట్ల వేడి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది.
తీర ప్రాంతవాసులకు అలర్ట్…
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తీరం వెంబడి గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున మృత్య్సకారులు చేపలవేటపై వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది.