ఖైరతాబాత్ గణనాథుడు (Khairatabad Ganesh) గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటలకు బడా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 7 గంటలకు నిమజ్జనం కోసం తరలిన వినాయకుడు.. ఒంటిగంటకు క్రేన్ నెంబర్-4 దగ్గరకు చేరుకున్నాడు. వెల్డింగ్ పనుల అనంతరం నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.
40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. మహాగణపతి శోబాయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా సచివాలయం ముందు నుంచి హుస్సేన్ సాగర్ వరకు సాగింది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది దశ మహా విద్యా గణపతి రూపంలో కొలువుదీరాడు ఖైరతాబాద్ గణపయ్య. ఈ విగ్రహాన్ని మట్టితో 63 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో రూపొందించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి.
ఇక, గణనాథుల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కోలాహలంగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 90 వేలకుపైగా గణేశ్ విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. హుస్సేన్ సాగర్ లోనే 30 వేలకు పైగా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై 14, ఎన్టీఆర్ మార్గ్ లో 10, పీవీ మార్గ్ లో 10 క్రేన్లతో ఈ కార్యక్రమం జరుగుతోంది. హుస్సేన్ సాగర్ తో పాటు 33 చెరువులు, 72 కొలనులను నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు.