గణనాధుల నిమజ్జనం (Immersion) సాఫీగా సాగుతుందని, రేపటి వరకు కూడా నిమజ్జనాలు కొనసాగించవచ్చునని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. నిమజ్జనాలు సాగుతున్న తీరు, ఏర్పాట్లను పరిశీలించిన తలసాని మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ (Khairathabad) గణేషుని నిమజ్జనం అనుకున్న సమయానికే జరుగుతుందని చెప్పారు.
ఖైరతాబాద్ వినాయకుడిని షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం చేసేందుకు ముందుగానే తగిన ఏర్పాట్లు చేశామని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు బాలాపూర్ గణనాథుడు కూడా ఇవాళ మధ్యాహ్న సమయానికి చార్మినార్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
రేపు ఉదయం వరకు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వినాయక నిమజ్జనం చూడడానికి లక్షలాదిమంది భక్తులు ఇప్పటికే తరలివచ్చారని, ఇంకా వస్తూనే ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
వినాయక శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నామన్నారు. గణనాథులను త్వరగా నిమజ్జనం అయ్యేలా చూడడం తమ ఉద్దేశం కాదని.. ఎవరు ఎప్పుడు వచ్చినా నిమజ్జనం చేసుకోవచ్చునని మంత్రి తలసాని స్పష్టం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు.