భారత్ (India) పై హమాస్ (Hamas) తరహా దాడులు చేస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్నున్ హెచ్చరించారు. పంజాబ్ కు సంబంధించి భారత్ ప్రభుత్వ విధానాలు హమాస్ తరహా దాడులకు దారితీసే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితులే వస్తే దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సి వుంటుందని తెలిపారు.
తాజాగా సిఖ్ ఫర్ జస్టిస్ గురు ఫత్వంత్ సింగ్ పన్ను మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భారత్ కు పన్ను తీవ్రహెచ్చరికలు చేశారు. పాలస్తీనా సంక్షోభం నుంచి ప్రధాని మోడీ చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. పంజాబ్ ను ఆక్రమించాలని భారత్ ప్రయత్నిస్తే దానికి తీవ్ర ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు.
పాలస్తీనా తరహాలో పంజాబ్ ప్రజలు హింసకు ప్రతి హింసతో సమాధానం చెబుతారని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. అలాంటి పరిణామాలకు ప్రధాని మోడీ, భారత్ లదే బాధ్యత అన్నారు. సిఖ్ ఫర్ జస్టిస్ బ్యాలెట్ పై నమ్మకం ఉంచిందని తెలిపారు. ఎస్ఎఫ్‌జే ఓటింగ్ పై నమ్మకం ఉంచిందన్నారు. పంజాబ్ కు విముక్తి జరుగుతుందన్నారు. అయితే అది బ్యాలెట్ లేదా బుల్లెట్ దేని ద్వారా పరిష్కారం అనేది భారత్ చేతులోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గురు ఫత్వంత్ సింగ్ సిక్కులకు ప్రత్యేక ప్రాంతం (ఖలిస్తాన్) ఏర్పాటు కోసం కెనడా వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ఆందోళనలు, నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటున్నారు. పలు దేశాల్లో సిక్కు యువతను ఖలిస్తాన్ వైపు ఆకర్షించి భారత్ పై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారు.