Kharge : ప్రధాని మోడీ, (Modi), హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) తమ పార్టీ పెట్టిన ప్రభుత్వ స్కూళ్లలో చదివినవారేనని కాంగ్రెస్ (Congress) చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (Mallikharjun Kharge) సెటైర్ వేశారు. మోడీ అధికారంలోకి వచ్చాకే స్కూళ్ళు వచ్చాయా ? మేం పెట్టిన పాఠశాలల్లోనే వారు చదువుకున్నారు. కానీ గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు అన్నారు. ఆదివారం ఛత్తీస్ గఢ్ లో జరిగిన ‘భరోసే కా సమ్మేళన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఖర్గే.. పార్లమెంటులోమణిపూర్ అంశంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నకు మోడీ సమాధానమివ్వకుండా దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపట్ల అవమానకరంగా మాట్లాడారని, అపహాస్యం చేశారని ఆరోపించారు.
మణిపూర్ లో జరిగిన జాతి విద్వేష హింసాత్మక ఘటనలపై రాహుల్ మాట్లాడితే.. దానికి మోడీ సమాధానమివ్వలేదన్నారు. అంతా తానే పరిస్థితిని చక్కదిద్దుతున్నట్టు ప్రసంగించారన్నారు. మణిపూర్ పరిస్థితిని ఛత్తీస్ గఢ్ లోని పరిస్థితితో పోల్చడమేమిటని ఖర్గే ప్రశ్నించారు.
ఈ రెండు రాష్ట్రాల మధ్య పోలిక ఏమైనా ఉందా అని అన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని, మణిపూర్ వెళ్లాలంటే మోడీకి భయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉంటున్న మోడీ మణిపూర్ ఎందుకు వెళ్తారని కూడా మల్లిఖార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
పార్లమెంట్ లో రెండు గంటలపైగా సాగిన మోడీ ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని చాలా తక్కువగా ప్రస్తావించారని, అది ఎలెక్షన్ స్పీచ్ లా ఉంది తప్ప .. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న హామీలేవీ లేవని ఆయన విమర్శించారు.