Kharge : అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ (Modi) చేసిన ప్రసంగం ఎన్నికల స్పీచ్ లా ఉందని కాంగ్రెస్ (Congress) చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (Mallikharjun Kharge) విమర్శించారు. తీర్మానంపై చర్చను మోడీ ‘ఎలెక్షన్ ర్యాలీ’ (Election Rally) గా వినియోగించుకున్నారన్నారు. మీ మొండితనాన్ని విడనాడి మణిపూర్ అంశంపై ముందే సభలో మాట్లాడి ఉంటే విలువైన పార్లమెంట్ సమయం వృధా కాకుండా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘చివరకు మీరు సభలో మణిపూర్ అంశంపై మాట్లాడారు.. ఇందుకు కృతజ్ఞతలు.. ఇకనైనా ఆ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరిస్తారని, షెల్టర్ హోమ్స్ లోని బాధితులు తిరిగి తమ ఇళ్లకు వెళ్తారని, వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’ అని ఖర్గే పేర్కొన్నారు.
మణిపూర్ పరిస్థితిపై మీరు ముందుగానే మాట్లాడి ఉన్న పక్షంలో ముఖ్యమైన బిల్లులను కూడా పార్లమెంటులో ఆమోదించి ఉండేవారమన్నారు. అవిశ్వాస తీర్మానం వంటి పార్లమెంటరీ ఆయుధాన్ని విపక్షాలు వాడవలసి రావడం విచారకరమని ఆయన ట్వీట్ చేశారు. . ఇక లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఈ సంప్రదాయం రాజ్యాంగానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీన్ని మేం ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ (Jairam Ramesh) కూడా.. అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ ని తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో.. లోక్ సభలో మోడీ 70 నిముషాలకుపైగా ఎలెక్షన్ స్పీచ్ ఇచ్చారని , ‘ఇండియా’ ను పదేపదే విమర్శిస్తూ వచ్చారని ఆయన మండిపడ్డారు.
అసలు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం వెనుక గల కారణాలపైన, అందుకు దారి తీసిన పరిస్థితులపైన మాట్లాడేందుకు నిరాకరించారని జైరాంరమేష్ తప్పు పట్టారు. మేం ఎందుకీ నిర్ణయానికి వచ్చామో ఆయన అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని వ్యాఖ్యానించారు.