బ్రిటన్ రాజు ఛార్లెస్-3(King Charles III) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్(Buckingham Palace) సోమవారం ప్రకటించింది. అయితే ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ విషయం బయటపడిందని పేర్కొంది. అయితే, క్యాన్సర్ రకం గురించి అధికారికంగా చెప్పలేదు. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని మాత్రం స్పష్టం చేసింది.
75 ఏళ్ల రాజు ఛార్లెస్-3 సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్లు ప్యాలెస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. ఛార్లెస్-3 చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు.
2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లోని తన ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు.ఛార్లెస్-3 దంపతులకు ఇద్దరు కుమారులు(విలియం, హ్యారీ), ఒక కుమార్తె(ప్రిన్స్ విలియం) ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ తన తండ్రిని పరామర్శించేందుకు త్వరలోనే యూకేకు చేరుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు.
మూడేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ.. ప్రస్తుతం తన భార్య మేఘన్ మార్కెల్, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వార్త తెలిసిన వెంటనే తండ్రికి ఫోన్ చేసిన మాట్లాడి లండన్‌కు బయల్దేరారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఛార్లెస్-3 కోడలు, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ ఉదర సంబంధిత వ్యాధి నుంచి కోలుకున్నారు. చార్లెస్-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘చార్లెస్-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్లు ఎక్స్ వేదికగా బ్రిటన్ రాజు ఛార్లెస్-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.