పేదలకు పంచడానికి కేసీఆర్ (KCR) ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు కానీ.. బడాబాబులకు అమ్మడానికి ఎలా వస్తోందని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). హైదరాబాద్ (Hyderabd) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూముల అమ్మకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పేదల నుంచి అక్రమంగా భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ దోపిడీ అరాచకాలు అన్నీ బయటపెడతామని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే.. అంగట్లో రాష్ట్రాన్ని అమ్మడమేనని అన్నారు కిషన్ రెడ్డి. సంపదను సృష్టించాలనే కానీ… అమ్ముకుంటూ పోతే వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయని చెప్పారు. వ్యవస్థల పతనానికి నాంది పలకడానికేనా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది అంటూ ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నారని.. భావి తరాల కోసం ఉండాల్సిన భూములను అమ్ముకుంటూ వెళ్తే.. రాష్ట్రంలో ఒక్క ఎకరా భూమి కూడా ప్రభుత్వం దగ్గర ఉండదని హితవు పలికారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రభుత్వభూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన వీడియోను ప్రదర్శించారు కిషన్ రెడ్డి. భూముల అమ్మకం ఇక్కడితో ఆపరని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దివాలా తీస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యే అక్రమంగా భూములు పంచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు 11 ఎకరాలు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 10 ఎకరాలు ఇచ్చారని, రెండు పార్టీలు కలసి పని చేస్తున్నాయని విమర్శించారు.
ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఏ పద్ధతిలో భూమి ఇచ్చామో.. అదే పద్దతిలో బీఆర్ఎస్ కు ఇస్తున్నామని జీవో కూడా ఇచ్చారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసే భూముల అమ్మకానికి కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. భూముల అమ్మకంతో వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.