బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఒక్కటే అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన పొలిటికల్ విజిట్ అని విమర్శించారు.
ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టుకును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా చూసి వచ్చారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ లోపభూయిష్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే తేల్చి చెప్పిందని వెల్లడించారు.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సందర్శనకు కూడా కాంగ్రెస్ అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. పార్టీ అభివృద్ధి కోసం బహిరంగ సభలకు వెళ్తాడని ఫైర్ అయ్యారు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికనే రాష్ట్ర విజిలెన్స్ ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇప్పుడు అదే నివేదికను మరోసారి రీ టైప్ చేసి పంపారు తప్ప.. కొత్తగా ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి నీటిని ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.