కేంద్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే అవినీతి, అరాచకాలు పెరిగిపోతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఆయన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయన్నారు.
దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలన్నారు. ఇక్కడ మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎవరు అభివృద్ధిని ఆపినా ఆగదన్నారు. తాను అభివృద్ధి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మోడీ వచ్చారు కాబట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. 500 ఏళ్లుగా రాముడు గుడిసెలోనే ఉన్నాడని స్వాతంత్రం వచ్చాక కూడా ఎవరు రాముడి గుడిని కట్టలేదన్నారు.
ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని వ్యాఖ్యానించారు. మన దేశ, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత అవసరమన్నారు. పేదలకు ఎల్పీజీ సిలిండర్లు ఇస్తుంది మోడీనేనని ఆయన అన్నారు. పొదుపు సంఘాలకు డిపాజిట్లు లేకుండా 20 లక్షల లోన్లు ఇస్తున్నామన్నారు.
ఆయుష్మాన్ భారత్ తీసుకువచ్చి పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి ప్రజలను ఆదుకున్నది మోడీ అని చెప్పుకొచ్చారు. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మోడీ(Modi) లేకపోతే దేశంలో అవినీతి, మజ్లిస్ గుండాయిజం, అరాచకాలు పెరుగుతాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.