ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై రాష్ట్ర నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది.. తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు.. ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ సంస్కృతికి కారణం కేసీఆర్ అని ఆరోపించిన ఆయన.. ఈ విధానాన్ని మొదట ప్రొత్సాహించిందే బీఆర్ఎస్ అధినేత అని వ్యాఖ్యానించారు..
నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీసులో నేడు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. పార్టీలు మారే లీడర్లను కుక్కలు, నక్కలు అంటున్న కేసీఆర్.. నాడు ఆ కుక్కలు, నక్కలను ఎందుకు తన పార్టీలోకి ఆహ్వానించారని ప్రశ్నించారు. ఆయన వేసిన మార్గంలోనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు అని మండిపడ్డారు.
ఇలాంటి వారు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని పేర్కొన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన అంశంగా పరిగణించిన మంత్రి.. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛను ఈ రెండు పార్టీలు హరించివేశాయని విమర్శించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులను చూస్తుంటే ఇది ఆషామాషీ కేసు కాదని.. స్వార్థంతో రాష్ట్రాన్ని నిలువునా ముంచి కేవలం వారి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే బాగుపడాలనే కుట్రతో ఈ చర్యకు దిగినట్లు ఆరోపించారు..
అదేవిధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరించిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.. ఈ రెండు ఉప ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ నేతల ఫోన్లే టార్గెట్‌గా ట్యాప్ చేశారని ఆరోపించారు. మరోవైపు పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ వ్యక్తుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసి భారీగా డబ్బులు దండుకొన్నారని మండిపడ్డారు..
అసలు ఈ ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరు? అనే విషయాన్ని పక్కన పెడితే.. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి ఘటనలు జరుగుతాయా? అనే అనుమానాన్ని లేవనెత్తారు.. ఇందులో కేసీఆర్ (KCR), ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని వార్తలు వినిపిస్తున్నట్లు పేర్కొన్నారు.. నిందితుల నిర్ధారణ జరిగాక పరిణామాలు తీవ్రంగా ఉండాలని, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.