లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు జనాల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఇంతవరకు రాలేదు. అయితే లోక్ సభ ఎన్నికలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టత ఇచ్చారు.
ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి 350కి పైగా లోక్ సభ సీట్లను తమ పార్టీ గెలుస్తోందని విశ్వాసంతో ఉన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు.
జాతీయ రహదారుల విస్తరణ జరిగిందని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్లడం లేదన్నారు.
బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేసిన అభివృద్ది బీజేపీకి శ్రీరామ రక్ష అవనుందని, ఆ అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వస్తున్నారని అంటున్నారు. ప్రధాని మోదీ వల్ల రూపాయికే కిలో బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు వచ్చాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని ధీమాతో ఉన్నారు. 10 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్గా ఇవ్వాలన్నారు.