బీజేపీ(BJP)కి కవిత(Kavitha) అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. కేసీఆర్ కూతురు ఇవాళ ఈడీ ముందు విచారణ ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని చెప్పారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంపై విచారణ చేస్తే కవిత పేరు వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందన్నారు. కవిత అరెస్టు అయితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ ఎందుకు దగ్ధం చేసేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో మధ్య నిషేధం చేస్తామని చెప్పిన కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని విమర్శించారు. అయితే, బీనామీ పేర్లతో వ్యాపారం చేశారనీ.. ఆధారాలను ధ్వంసం చేసి బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉందన్నారు కిషన్ రెడ్డి. మూడోసారి 370 స్థానాలు బీజేపీకి ఒంటరిగా రావాలన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి 400 స్థానాల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామనీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పదేళ్లలో కాంగ్రెస్ హయాంలో రూ. 22లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. అయితే, ఏ విపక్షం కూడా మోడీ ప్రభుత్వం అవినీతి చేసిందని విమర్శించే అవకాశం లేకుండా చేశామన్నారు.
అవినీతికి పాల్పడితే బీజేపీ కార్యకర్తలైనా విపక్షాల నేతలైనా విచారణ ఎదుర్కోవాలన్నారు. కవిత అనుచరులు, బినామీలను విచారిస్తే కవిత పాత్ర ఉందని తేలిందని ఆయన వివరించారు. విచారణకు పిలిస్తే సహకరించకుండా మొండికేసిందని తెలిపారు. అందుకే ఇప్పుడు అరెస్టు అయ్యిందని చెప్పారు. ఇది బీరు, బ్రాందీ కేసు.. ఢిల్లీ ప్రభుత్వం కేసుని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మరోవైపు రేపు ఉదయం జగిత్యాలలో నిర్వహించే సభలో మోడీ పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉత్తరాదిన బీజేపీకి ఘననీయమైన సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చాలామంది ఐఏఎస్‌లు బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్కరిని అడిగినా మోడీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. లక్షలాది ఉద్యమకారులు పోరాటం చేస్తే రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో నలిగి పోయిందని కిషన్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు.