4 కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణా వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ని ప్రజలు నమ్మని పరిస్థితిలో తెలంగాణా బిల్లుని కాంగ్రెస్ పెట్టిందని ఆయన చెప్పారు. 42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్, హామీ ఇచ్చాం, తెలంగాణ (Telangana) ఇచ్చామని చెప్పుకోవడం అన్యాయం అని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో తెలంగాణా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి కూడా అనేక రకాలుగా హామీలు ఇస్తూనే ఉంది, కానీ ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చాయని వేటిని అమలు చేయలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సమావేశం…బీఆర్ఎస్ స్పాన్సర్ చేసిన సభేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…ఈ రెండు పార్టీలు ఒకటేనని, ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. ఈ రెండు పార్టీలు కలిసిపోతాయన్నారు. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని, బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.
తెలంగాణా విమోచన దినాన్ని బీఆర్ఎస్ సమైక్యత దినం అని చెప్పి.. పెద్దల త్యాగాలను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తోందని, ఇది ఇది ఏరకంగా సమైక్యత దినం? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విముక్తి ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో.. సమైక్యత పేరుతో కార్యక్రమాలు చేస్తారా? 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి.. సమైక్యతకు, విమోచనానికి తేడా తెలియదా? అని కిషన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.