Telugu News » Kishan Reddy : తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ…!

Kishan Reddy : తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ…!

ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు చేసిన పోరాటం ఆయన గుర్తు చేశారు. నీళ్లు-నిధులు-నియామకాలు కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు ఇలా ఎన్నో బాధలు చూశామన్నారు.

by Ramu

తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ జి. కిషన్ రెడ్డి (Kishan Reddy)బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు చేసిన పోరాటం ఆయన గుర్తు చేశారు. నీళ్లు-నిధులు-నియామకాలు కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు ఇలా ఎన్నో బాధలు చూశామన్నారు.

1969 ఉద్యమం సమయంలో కాంగ్రెస్ సర్కార్ వల్ల పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థులు అమరులయ్యారని చెప్పారు. అటు మలిదశ ఉద్యమంలో మన కళ్ల ఎదుటే 1200 ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ గొంతుకలు కలిసి నినదిస్తే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏ ఒక్క వ్యక్తి ద్వారానో, లేదా ఒక కుటుంబ త్యాగం వల్ల రాలేదన్నారు.

ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలొ ఉద్యమ ఆకాంక్షల నెర వేరాయా అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను చేరుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. పదేండ్ల కాలంలో కేసీఆర్ పాలనాపరమైన అసమర్థత మన కండ్లకు కొత్తొచ్చినట్టు కనిపిస్తోందన్నారు.

రాష్ట్రం వచ్చాక నీళ్ల పేరిట కేసీఆర్ ప్రభుత్వం బహిరంగ దోపిడీకి పాల్పడిందన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అంచనాలను పెంచి.. అడ్డగోలు దోపిడీకి కేసీఆర్ బాటలు వేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. నిధుల విషయంలోనూ ఇదే తంతు జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి మిగులు బడ్జెట్ ఉంటే ఆ తర్వాత పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పుగా మారిందన్నారు. ఈనాడు తెలంగాణలో ప్రతి వ్యక్తి పై దాదాపు లక్షా 25వేల అప్పు ఉందన్నారు.

నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఆక్షేపనీయంగా ఉందన్నారు. నేడు ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితికి రావడానికి కేసీఆర్ అసమర్థ పాలనే కారణమన్నారు. టీఎస్పీఎస్సీ పరిస్థితి మూడు లీకేజీలు, ఆరు రద్దులుగా మారిందని చెప్పారు. రాష్ట్రంలోని 39 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కశాతానికైనా ఉద్యోగాలు అందాయా? అని ప్రశ్నించారు.

దళితులకు మూడెకరాలు, సీఎం పదవి అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. దళితులను అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం వారు చేస్తున్న డిమాండ్లను గుర్తించి, ప్రధాని హోదాలో హాజరై వారికి భరోసా ఇచ్చారన్నారు. గత ఏడు దశాబ్దాలు రాజ్యధికారం కావాలన్న బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో తొలి బీజేపీ సీఎం బీసీ వర్గాలకు చెందిన వారేనని హామి ఇచ్చారన్నారు.

అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల బండిగా బీజేపీ ముందుకు తీసుకెళ్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మొదటి నుంచి అవహేళన చేస్తున్నది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ప్రతి నిర్ణయంలోనూ కేవలం తన రాజకీయ లబ్ధి కాంగ్రెస్ చూసుకుంటుందన్నారు. ఉద్యమ సమయం నుంచి ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

వీటన్నింటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణంగా మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందామని తెలిపారు. అమరవీరులు కలలుగన్న ‘సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని’ సాకారం చేసుకుందామన్నారు.

You may also like

Leave a Comment