రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ముఖ్యంగా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న పోటీ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తుందని అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న వారిపై ప్రతిపక్షాలు విమర్శల రాళ్ళు విసురుతుండగా.. అంతే ధీటుగా వాటిని తిప్పికొడుతున్న సంఘటనలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇక ప్రచారానికి తెరపడే సమయాలు దగ్గర పడుతున్న కొద్ది నేతలు మాటలకు పదునుపెడుతున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy).. మరోసారి గులాబీ పై విమర్శల అస్త్రాలు వదిలారు. కాంగ్రెస్ (Congress) బీఆర్‌ఎస్ (BRS) ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని.. మాయమాటలతో ప్రజలను మోసం చేయలేరని విరుచుకు పడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ఇంకా కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఇంకా రాష్ట్రాన్ని దోపిడి చేయాలని చూస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP) అభ్యర్థి, కృష్ణాయాదవ్ తరపున.. కాచిగూడ (Kakachiguda) లింగంపల్లి వినాయక ఆలయం నుంచి నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారని తెలిపారు. సుకుమారమైన గులాబీ పువ్వు రంగు కేవలం వంటి మీద వేసుకున్న కండువాకు మాత్రమే ఉందని.. కాని బీఆర్ఎస్ నేతల గుండెల్లో అధికార దాహం.. ధన దాహం కనిపిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు..
మరోవైపు అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి, కృష్ణాయాదవ్ మాట్లాడుతూ.. అంబర్‌పేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కృష్ణాయాదవ్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని గద్దెనెక్కి.. అప్పులపాలు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని కృష్ణాయాదవ్ తెలిపారు. ఆలోచించుకోండి ప్రజల్లారా.. తెల్ల కాగితానికి రంగులేసి మెరుపులు మెరిపిస్తున్న బీఆర్ఎస్ కావాలా.. ప్రజల కోసం పాటుపడే బీజేపీ కావాలా అని ప్రశ్నించారు కృష్ణాయాదవ్.. బీజేపీని గెలిపించమని ఓటర్లను కోరారు..