పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏళ్ల కిందట కట్టిన ఇళ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి(Central Minister) కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ఆయన బస్తీ బాట పట్టారు. ఈ సందర్భంగా గురువారం బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తీలో కిషన్‌రెడ్డి పర్యటించారు. బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో 30శాతం పైగా జనాభా హైదరాబాద్‌లోనే ఉందన్న ఆయన హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని అన్నారు. కేవలం ధనవంతులు ఉన్నచోటే హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎకనామిక్ సిటీ పేరుతో ఫ్లైఓవర్స్ కట్టి రంగులుపూసి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.
మెయిన్ రోడ్లు దిగి బస్తీల్లో పర్యటించాలని కేటీఆర్‌కు గతంలో పదేపదే గుర్తుచేశామన్నారు. అయినా ఏనాడూ వారు బస్తీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. బస్తీలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు, వీధిలైట్లు లేక, డ్రైనేజీ సమస్యలతో పాటు కనీస సదుపాయాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్ సెంటర్లు లేవని, ప్రభుత్వ పాఠశాలలు పాత భవనాలతో పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాయన్నారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తుండటం సరికాదన్నారు. పాటిగడ్డ కాలనీలో సుమారు 15ఏళ్ల కిందట కట్టిన ఇళ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో గతంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అలాట్మెంట్ చేయాలన్నారు.