ఉద్యోగం, ఉపాధి ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram). ఈమధ్యే ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక (Pravallika) ఘటనపై ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ (KTR), పోలీసులు అసత్య ప్రచారం చేస్తున్నారని.. నిరుద్యోగ జేఏసీ (JAC) సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. ప్రవల్లిక ఉద్యోగం కోసం ఎంతో కష్టపడిందని.. ఆ కష్టానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
ప్రవల్లిక రాసుకున్న నోట్స్ ఉన్నాయని, హైదరాబాద్ లో ఉండి ఉద్యోగం సాధించిన తర్వతనే ఇంటికి వస్తానని ప్రతిజ్ఞ చేసిందని తెలిపారు. కానీ, ఉద్యోగం కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు కేసులు వేస్తేనే ఎగ్జామ్స్ రద్దయ్యాయని కేటీఆర్ అన్నారని మండిపడ్డారు కోదండరాం. పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోతే కేసులు వేయక ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలు అని విమర్శించారు. 2 లక్షలపైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, లక్ష కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ చేశారు. ప్రవల్లిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేసిందని ఫైరయ్యారు. పేపర్ లీకేజ్, పరీక్ష రద్దు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కోదండరాం. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెన్షన్, రైతుబంధు, గ్యాస్ ధర తప్ప.. ఎక్కడా ఉద్యోగాలపై లేదంటూ ఫైరయ్యారు. మేనిఫెస్టోలోనే నిరుద్యోగులు లేకపోతే.. వాళ్ళ విధానాల్లో ఎక్కడ ఉంటారన్నారు. ప్రవల్లిక పైన వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ పెడితే.. పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా ప్రవల్లిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని కేటీఆర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు కోదండరాం.