గ్రూప్-2 (Group-2) పరీక్షను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని అంతా సిద్ధం చేసుకుంటోంది టీఎస్పీఎస్సీ (TSPSC). అయితే.. ఇతర పరీక్షలు ఉన్న నేపథ్యంలో రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి వేలాదిమంది అభ్యర్థులు మొన్న టీఎస్పఎస్సీ ఆఫీస్ ను ముట్టడించారు. కొందరైతే.. హైకోర్టు (High Court) ను కూడా ఆశ్రయించారు. పరీక్ష (Exam) వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు.
అభ్యర్థులకు తోడుగా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగడంతో ఈ వివాదం హీటెక్కింది. గ్రూప్- 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం గన్ పార్క్ వద్ద దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. పరీక్ష వాయిదా వేయాల్సిందేనని కోదండరాం డిమాండ్ చేస్తున్నారు.
ఇటు ఇదే డిమాండ్ తో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ను సైతం పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తానని వెల్లడించారు.
మరోవైపు, పరీక్ష వాయిదాపై 14న నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించింది. ఈ నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్ తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని అంటున్నారు అభ్యర్థులు. దీనివల్ల ప్రిపేర్ అయ్యేందుకు సమస్యగా ఉందని వాపోతున్నారు.