తెలంగాణ (Telangana)లో రాజకీయాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి.. ఎన్నికల ఆరంభంలో అంటుకున్న ఈ మంటలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింతగా వ్యాపించాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు ఈ అంశంపై మాటలకు అందని విమర్శలు చేసుకొంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
రాష్ట్రంలో మొదటి నుంచి కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నా.. అధికారులు, నిపుణులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కట్టిందని మండిపడ్డారు.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కామధేనువని నమ్మించడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట శాపంగా, భారంగా మారిందని కోదండరామ్ (Kodandaram) ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ (BRS) నేతలు నేడు మేడిగడ్డ (Madigadda) సందర్శనకు వెళ్లడంపై స్పందించిన కోదండరామ్.. నాంపల్లి, పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఈ రోజు బీఆర్ఎస్ చేస్తుంది చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని విమర్శించారు. ఇది మూడు పిల్లర్లకు సంబంధించిన వ్యవహారం కాదని మండిపడ్డారు.. స్లాబ్ ప్రభావం మిగితా పిల్లర్ల మీద కూడా ఉంటుందని వెల్లడించారు.
ఈ అంశాన్ని చిన్న సమస్యగా చూస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేవలం సాంకేతిక లోపం అని సమర్థించుకోవడం వారి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని కోదండరామ్ అన్నారు.. ఇప్పటికే ప్రణాళిక, నాణ్యత, డిజైన్, నిర్వహణ లోపం ఉందని నివేదికలు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఏదో న్యాయం చేసిన ధీరుల్లాగా మేడిగడ్డకు బయల్దేరిన నేతలు, ఇంకా ఏం మాయచేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన మూడేళ్లకు పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ల లెక్క ప్రకారం.. గత నాలుగు సంవత్సరాల్లో 97వేలకు నీళ్లు వచ్చాయి.. కేవలం 40వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు. మల్లన్న సాగర్ భూకంపాలు వచ్చే ప్రాంతంలో కట్టారని ఆరోపించారు.. ఆ ప్రాజెక్టు కట్టినా నీళ్లు నింపే పరిస్థితి లేదని కోదండరామ్ పేర్కొన్నారు.