మంత్రి కేటీఆర్ (KTR) కు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)కి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ తమ పార్టీ, కుటుంబం కోసం రూ.1000 కోట్ల ‘కే’ పన్ను వసూలు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.
ఫ్యామిలీ ఫస్ట్, పీపుల్ లాస్ట్ అన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని ఆయన ధ్వజమెత్తారు. ఈ విధానాన్నే తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ అమలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే ‘ది లూట్ సూట్’సర్కార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
అంతకు ముందు కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. అక్కడి ప్రభుత్వం రాజధాని బెంగళూరులో బిల్డర్లకు చదరపు అడుగుకు రూ. 500 చొప్పున పన్ను విధిస్తోందని అన్నారు.
ఇది ఒక ‘రాజకీయ ఎన్నికల పన్ను’అని ఆయన ఆరోపణలు చేశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కాస్త ఇప్పుడు స్కామ్‌ల వారసత్వంతో స్కామ్ గ్రెస్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆ ట్వీట్ వైరల్ కావడంతో తాజాగా దానిపై కోమటి రెడ్డి స్పందించారు.