తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గరం గరంగా సాగుతున్నాయి.. బీఆర్ఎస్ అవినీతిపై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్, డిజైనర్, కాంట్రాక్టర్ ఇలా అన్ని కేసీఆర్ అని విమర్శించారు. 70 ఎంఎం ప్రాజెక్ట్ మూవీలో ప్రొడ్యూసర్, యాక్టర్, విలన్ ఇలా అన్ని పాత్రలు పోషించి.. చివరికి ఏమి ఎరుగనట్లు ఉన్నారని ఆరోపించారు..
కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సమాధానం చెప్పాలని.. హరీష్ రావు (Harish Rao) మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు. హరీష్ రావును కేసీఆర్ (KCR) కేవలం కలెక్షన్లకు వాడుకుంటారని.. కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేయడానికే ఆయన పనికొస్తాడని.. వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం మీద ఆయనకు అవగాహన లేదని విమర్శించారు.. ఇలాంటి కలెక్షన్ కింగ్ చెబితే తాము వినాలా? అని బీఆర్ఎస్ శ్రేణులను ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేసి.. అసెంబ్లీకి రాకుండా తిరుతున్న వారిని ఏమనాలో మీరే నిర్ణయించుకొండని వెల్లడించిన వెంకట్ రెడ్డి.. తమ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల-ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. మరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు సాగునీరు వస్తాయని వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని వందసార్లు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తాను తీసుకెళ్లానని గుర్తుచేశారు.
తనతో పాటు మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించారని.. అయినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి మట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇన్నాళ్ళూ పాలిచ్చే బర్రె అనుకున్నాం కానీ అది దొంగ బర్రె అని తెలిసి ప్రజలు వాతలు పెట్టారని సైటర్లు వేశారు..