కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా నేడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ పై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకొని కట్టారా? లేక కేసీఆరే (KCR) స్వయంగా.. చీఫ్ ఇంజినీర్ అని భావించి డిజైన్ చేశారా? అని ప్రశ్నించిన వెంకట్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని… బ్యారేజీ కట్టి పైకి తీసుకు వచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
ప్రాజెక్టు పై అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసిందని తెలిపిన వెంకట్ రెడ్డి.. ఇంజినీర్లు, అధికారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు ఇలాంటి ప్రాజెక్టు కట్టమని దొర చెబితే మీరు సెలవు పెట్టి వెళ్లవలసిందని సూచించారు. పిచ్చి ప్రాజెక్ట్ కట్టి.. జాతీయ హోదా కల్పించమని హంగామా చేయడం వెర్రితనమని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
ఇక్కడ మూడో టీఎంసీ అసలు అవసరమే లేదని పేర్కొన్న వెంకట్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయినా… మంత్రులు అయినా… ఎవరు ఉన్నా.. ప్రజల కోసం కట్టే ప్రాజెక్ట్ ప్లానింగ్ తప్పుంటే.. తప్పును తప్పుగా ఇంజినీర్లు చెప్పాల్సిందే అని తెలిపారు.. మీరు ప్రజలను కాపాడవలసిన వారు.. ప్రజా ధనాన్ని వృధా చేస్తుంటే ఎలా ఊరుకొన్నారని ఇంజినీర్లని ప్రశ్నించారు వెంకట్ రెడ్డి..