బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, హైదర్‌నగర్(Madapur, Hydernagar) ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంతో పాటు తెలంగాణలోనూ మోడీ వేవ్ కనిపిస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీని న్యాయవద్ధంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ తంటాలుపడుతోందని విమర్శించారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ పార్టీకి కొత్తేమీ కాదని దుయ్యబట్టారు.
అదేవిధంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మియాపూర్ ప్రాంతంలోని మయూరి నగర్ పార్క్, దివ్యశక్తి అపార్ట్మెంట్, వేర్టెక్స్ ప్రైడ్, హైదర్‌నగర్ పరిధిలోని వశిష్ట అపార్ట్మెంట్, వేర్ టెక్స్ కళ్యాణ్ రెసిడెన్సీ, ఎస్సార్ రెసిడెన్సీ, కావ్య గ్రీన్ అపార్ట్ మెంట్, వేర్టెక్స్ ప్రెసెంట్, జలవాయు విహార్ కమ్యూనిటీహాల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఎంఐఎం కన్నా కాంగ్రెస్‌కే ముస్లిం వర్గాల ఓట్లు అధికంగా పోలవుతాయని విశ్వేశ్వర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే 13న జరగనున్న పోలింగ్‌లో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్, గంగాధర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హరిబాబు, రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.