ఆలిండియా స్థాయి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటా(KOTA) ఆత్మహత్యలు (Students Suicides) అస్సలు ఆగడం లేదు. విద్యార్థులు వరుసగా సూసైడ్స్ చేసుకుంటున్నారు. అయితే, ఈ వరుస సూసైడ్స్‌కు సంబంధించి కారణాలు తెలియరావడం లేదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడి కారణంగానే చనిపోతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
రెండ్రోజుల కిందట యూపీకి చెందిన మహ్మద్ ఉరుజ్ ఖాన్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..యూపీలోని లక్నోకు చెందిన సౌమ్య (19)కోటాలో నివాసముంటూ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (NEET)కి ప్రిపేర్ అవుతోంది.
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
2024లో ప్రారంభంలోనే కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 8కి చేరింది. గతేడాది ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల సంఖ్య 29గా ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తంచేసిన కేంద్రం కోచింగ్ సెంటర్లకు ఆదేశాలు జారీచేసింది.విద్యార్థులపై ఒత్తిడి చేయరాదని స్పష్టంచేసింది.అయినా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో కోటాను విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా కొందరు అభివర్ణిస్తున్నారు.