తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి.. నేతల నోటి నుంచి వాగ్ధానాలు కూడా ఏకధాటిగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) బీజేపీ (BJP) బీఆర్ఎస్ (BRS) పోటాపోటీగా ఓటర్లకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అవి అమలు చేస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అధికారం చేపట్టడం ప్రధమ కర్తవ్యంగా ఓటర్లను ఆశల ఊబిలో దించుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే వివిధ పార్టీల ప్రముఖులు నోటికి వచ్చినన్ని హామీలు ఇచ్చారు. మరోవైపు ఓటింగ్ ప్రక్రియకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పలు హామీలను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భావనతో మరిన్ని కీలక హామీలు ఇస్తున్నదని ప్రచారం.. తాజాగా ఆటో వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కొత్త ఇల్లు కొనాలనుకునే వారి కోసం కొత్త పథకాన్ని రూపొందించినట్టు తెలిపింది.
హెచ్ఐసీసీలో క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023లో పాల్గొన్న కేటీఆర్ (KTR)..వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు ఇచ్చే పథకం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న కేటీఆర్.. అందరికీ ఇళ్లు అనే నినాదానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మరోవైపు డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి పథకాలు అలాగే ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు.
ఈ పథకం ద్వారా పొందిన రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తోందని తెలిపిన కేటీఆర్.. రుణం తీసుకుని ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలు జోడిస్తారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోగా మరిన్ని కొత్త హామీలు ప్రకటిస్తూ.. ఓట్ల కోసం నేతలు ప్రజలను ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.