– ప్రవల్లిక గ్రూప్స్ కి అప్లై చేయలేదన్న కేటీఆర్
– ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్న నిరుద్యోగులు
– సోషల్ మీడియాలో ప్రశ్నల దాడి
– ఎన్నికల సమయం కావడంతో..
– ఇష్యూని డైవర్ట్ చేశారని ఆగ్రహం
– కేటీఆర్ పై ప్రతిపక్షాల ఎటాక్
– అబద్ధాల నటరత్న అంటూ ఆకునూరి ఫైర్
ఇటీవల గ్రూప్-2 (Group-2) అభ్యర్థి ప్రవల్లిక (Pravallika) ఆత్మహత్య తెలంగాణ (Telangana) లో సంచలనం రేపింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడిన సమయంలోనే ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో.. విద్యార్థి సంఘాలు, విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శలు గుప్పించాయి. అయితే.. ఈ చావుకు కారణం లవ్ ఫెయిల్యూర్ అని పోలీసులు తేల్చడంపైనా.. కుట్ర దాగి ఉందనే ఆరోపణలు చేశాయి. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా ప్రవల్లిక ఘటనపై స్పందించారు. ‘‘ప్రవల్లిక అసలు గ్రూప్స్ కే అప్లై చేయలేదట.. అది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావుడి చేశాయి’’ అని అన్నారు. అమ్మాయి మరణంతో దిగజారుడు రాకీయం కరెక్టా..? అంటూ ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ పై ఫైరవుతున్నారు నిరుద్యోగులు. ఇవిగో ప్రూఫ్స్ అంటూ ప్రవల్లిక గ్రూప్-1,2,3,4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న పేపర్లు, హాల్ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇటు, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా స్పందించారు. ‘‘అబద్ధాల నటరత్న కేటీఆర్ మాటలు చూడండి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఏం అబద్ధం చెప్పడానికైనా వెనకాడడం లేదు. ప్రవళ్లికను అవమానపరచడం ద్వారా 35 లక్షల నిరుద్యోగులను అవమానపరుస్తున్నారు వీళ్ళు. ఎన్నికల్లో వీళ్ళను బొంద పెట్టడానికి యువత ముందుకు రావాలి. ప్రవల్లిక టీఎస్పీఎస్సీ డాక్యుమెంట్ చూడండి’ అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టారు ఆకునూరి మురళి.
ఎన్నికల సమయం.. ఇష్యూ మరింత హైలైట్ అయితే డ్యామేజ్ ఖాయమనే ప్రభుత్వం ప్రవల్లిక ఇష్యూని డైవర్ట్ చేసిందనే ఆరోపణలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేటీఆర్ ఇలా మాట్లాడడంతో మరింతగా రగిలిపోతున్నారు నిరుద్యోగులు. ఇది ముమ్మాటికీ ఎన్నికల్లో తమకు నష్టం కలగకుండా బీఆర్ఎస్ పెద్దలు ఆడించిన డ్రామాగా చెబుతున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి.