తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్ (KTR). శుక్రవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరరాజా (Amara Raja) గ్రూప్ నిర్వహించిన ఈవోల్వ్ -అడ్వాన్స్ డ్ బ్యాటరీ టెక్నాలజీస్ ప్రత్యేక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత నైపుణ్యాన్ని ఒడిసి పట్టేందుకు టీఎస్ఐసీ (TSIC) కృషి చేస్తోందని తెలిపారు. ప్రముఖ కంపెనీలకు తెలంగాణ ఫేవరేట్ రాష్ట్రంగా మారిందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని చెప్పారు కేటీఆర్. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అమర్ రాజా కంపెనీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని.. పరిశోధన, డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని వివరించారు.ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం జహీరాబాద్ ను ఎంపిక చేశామని తెలిపారు.
ఇక వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు కేటీఆర్. శంషాబాద్ లోని నోవాటెల్ లో దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని.. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని చెప్పారు.
గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని.. ఇప్పుడు అక్కడికే వలసలు వస్తున్నారని అన్నారు కేటీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, అన్నదాతలకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామని.. రైతు ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. ఉమ్మడి పాలనలో కనీసం ఏడాదికి ఒక పంట వేసుకోలేని దుస్థితి నుంచి కేసీఆర్ పాలనలో 3 పంటలు వేసే స్థాయికి ఎదిగామని చెప్పారు కేటీఆర్.