Telugu News » KTR : 420 కాంగ్రెస్.. నమ్మితే నట్టేట మునగడమే!

KTR : 420 కాంగ్రెస్.. నమ్మితే నట్టేట మునగడమే!

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని.. వారెంటీ లేని కాంగ్రెస్‌ ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని విమర్శించారు.

by admin
KTR Powerful Punches On Congress

– బీఆర్‌ఎస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు
– గ్రామాల్లో పంచ విప్లవాలతో అభివృద్ధి
– ఎంత అభివృద్ధి చేస్తున్నా..
– అవకాశవాదులు విమర్శిస్తూనే ఉంటారు
– అలాంటివాళ్లను నమ్మొద్దు
– వారెంటీ లేని కాంగ్రెస్ ను..
– అడ్రస్ లేకుండా తరిమేద్దామన్న కేటీఆర్
– వైరాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

బీఆర్‌ఎస్‌ (BRS) గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు మంత్రి కేటీఆర్ (KTR). ఖమ్మం (Khammam) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు సహా పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతోంది.

KTR Powerful Punches On Congress

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌ ను పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చే ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల రాములు నాయక్‌ కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని ప్రశంసించారు. రాములు నాయక్ (Ramulu naik) వైరా ప్రజల మనసు గెలుచుకున్నారని కొనియాడారు. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని.. పదవి త్యాగం చేయాల్సి వచ్చినా హుందాగా పార్టీ కోసం సేవ చేయటం అభినందనీయమన్నారు.

కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని.. వారెంటీ లేని కాంగ్రెస్‌ ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని విమర్శించారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 వందల పింఛన్ నుంచి రూ.2 వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ దేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొంతమంది అవకాశవాదులు వస్తున్నారని వారి మాటలను నమ్మొద్దని అన్నారు మంత్రి. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు ఉన్నాయని.. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పైకి ఎదగాలని సూచించారు. కేసీఆర్ గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించాలనే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామాల్లో పంచ విప్లవాలు సాధ్యమయ్యయన్నారు.

హరిత విప్లవం ద్వారా ఎన్నడూ చూడని విధంగా వరి ధాన్యం పండించి పంజాబ్, హర్యానాను తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. నీలి విప్లవంతో చెరువులు, కాలువలు నిండుకుండల్లా మారి మత్స్యకారులకు చేపల పెంపకం జరిగిందన్నారు. గులాబీ విప్లవం ద్వారా పశు సంపద ప్రోత్సాహంతో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ గా ఉందన్నారు. శ్వేత(క్షీర) విప్లవం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న పాల డెయిరీలు లాభాల బాటలో నిలిచాయని చెప్పారు. ఇక, పసుపు విప్లవం ద్వారా పామాయిల్ వంటి నూనె ఉత్పత్తిలో తెలంగాణ రాబోయే రోజుల్లో ముందుంటుందని తెలిపారు కేటీఆర్.

You may also like

Leave a Comment