తెలివి తక్కువ కాంగ్రెస్ (Congress) నేతల చేతుల్లో రాజ్యాన్ని పెట్టొద్దని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డికి 24 గంటల కరెంట్ కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలంతా వికారాబాద్ వచ్చి కరెంట్ తీగలు పట్టుకుని చూడాలన్నారు. అటు కరోనా, ఇటు కాంగ్రెస్ వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాప్యం అవుతోందన్నారు.
వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ సర్కార్ హయాంలో వికారాబాద్‌లో ఎవరైనా మరణిస్తే కనీసం స్నానం చేసేందుకు నీళ్ల కోసం కూడా కరెంట్ లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. కరెంట్ విషయంలో రేవంత్‌కు ఏమైనా అనుమానం ఉంటే విద్యుత్ తీగలను పట్టుకోవాలని సూచించారు.
కరెంట్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగు నీటి సమస్య ఉండేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక ఆ సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆగమాగం చేస్తాయని మండిపడ్డారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు.
ఇప్పటికే హస్తం పార్టీకి ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు వచ్చి మరో ఛాన్సు అడుగుతున్నారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 11 అవకాశాలిచ్చినా ఏమీ చేయలేని దద్దమ్మలకు ఇప్పుడు మరో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.