– పదే పదే తెలంగాణను అవమానిస్తున్నారు
– మోడీ క్షమాపణ చెప్పాల్సిందే
– పాలమూరుకు ఏం చేశారని వస్తున్నారు
– వచ్చే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతే
– కృష్ణా జలాల్లో వాటా తేల్చాకే పాలమూరుకు రావాలి
– దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరమా?
– చంద్రబాబు అరెస్ట్ తో మాకేం సంబంధం
– మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
తెలంగాణ (Telangana) ను ప్రధాని మోడీ (PM Modi) పదేపదే అవమానిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్ (KTR). హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమృతకాల సమావేశాలని చెప్పి మోడీ విషం చిమ్మారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును ఎందుకు అవమానిస్తున్నారని అడిగారు. ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందేనని.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ ఎందుకొస్తున్నారు?
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు కేటీఆర్. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. మహబూబ్ నగర్ కి ఏం చేశారని మోడీ వస్తున్నారని అడిగారు. పదేళ్ల నుంచి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదని.. అది తేల్చాకే పాలమూరుకు రావాలన్నారు. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ అని విమర్శించారు. ఓట్లు కావాలంటే ప్రధానికి మంచి పనులు చేసే సత్తా ఉండాలన్న ఆయన.. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు నమ్మరని హితవు పలికారు.
గవర్నర్ వ్యవస్థ అవసరమా?
ఎమ్మెల్సీలుగా ఇద్దర్ని సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మండిపడ్డారు కేటీఆర్. ఇద్దరిలో ఒకరు ప్రొఫెసర్, మంచి వ్యక్తి అని ఆమోదిస్తారని అనుకున్నామన్నారు. సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ లో సేవలు చేశారని వివరించారు. మోడీ అజెండాతో గవర్నర్ పని చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆమెను నియమించడం సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధం కాదా? అంటూ ప్రశ్నించారు. అసలు, గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా? అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఇది బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అని తెలిపారు. గవర్నర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఆ ఇద్దరు అన్ ఫిట్ అంటే.. మరి మీరు అన్ ఫిట్టా? లేక మోడీ అన్ ఫిట్టా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ పై!
చంద్రబాబును ఏపీలో అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఆందోళనలేంటని అన్నారు కేటీఆర్. ఈ అరెస్ట్ కు తెలంగాణకు సంబంధం ఏంటని.. ఇది ఏపీలోని రెండు పార్టీల మధ్య సమస్యగా చెప్పారు. రాజకీయ ఘర్షణలో ఇది జరిగిందని.. తెలంగాణలో గొడవలెందుకని.. ఈ విషయంలో తాము న్యూట్రల్ గా ఉన్నామని తెలిపారు. ఆందోళనలకు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పారు కేటీఆర్.