తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు. సర్పంచులకు నిధులు రాక.. చేసిన పనులకు బిల్లులు రాక చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని భట్టి విమర్శించారు. ఏకగ్రీవం అయిన జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదన్నారు. అణగారిన వర్గాలకు విద్యను అందకుండా దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఇప్పటి వరకు టీచర్లను నియమించిన దాఖలాలు లేవని.. డీఎస్సీ (DSC) ప్రకటన లేదని మండిపడ్డారు భట్టి. దీనివల్ల టీచర్ (Teacher) పోస్టుల భర్తీ కాకుండా ఆగిపోయిందని, వెంటనే డీఎస్సీ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ (Job Calendar)ప్రకటించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు దారి దోపిడీ దొంగలుగా వ్యవహరించినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు.
భట్టి విమర్శలపై మంత్రులు వరుసగా కౌంటరిచ్చారు. మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్రెస్ కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలికా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ సాధనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాత్రకు తేడా ఏందంటే.. బ్రిటిషోళ్ల మీద భారతీయులు కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నారు. బ్రిటిషోళ్లు మేం స్వాతంత్ర్యం ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్ గా ఉంటది. అదొక్కటే కాదు.. నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటదో.. మాకు అంతే బాధ ఉంటది. మంత్రసాని పాత్ర పోషించిన వారే కాంగ్రెసోళ్లు. వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్ రెడ్డి గతంలో అన్నారు’’ అని విమర్శించారు కేటీఆర్.
ప్రతిపక్షాలకు 3 చెరువుల నీళ్లు తాగిస్తాం.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మీరు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ డబ్బా ఇండ్లు కట్టించి ఇచ్చిందని.. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానమన్నారు. ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను ఏ పదవీ తీసుకోనని తెలిపారు. తప్పి చేసినట్లు రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని కాంగ్రెస్ నేతలకు చాలెంజ్ చేశారు కేటీఆర్.