అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు(Shooting) కలకలం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లాస్ వెగాస్ యూనివర్సిటీ(Las Vegas University)లో బుధవారం గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని కాల్చి చంపేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా నిందితుడిని కాల్చి చంపినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషంగా ఉందని చెప్పారు.
అధికారులు బాధితులను ఇంకా గుర్తించనట్లు తెలుస్తోంది. యూఎస్ వర్సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీసు డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రాలేదు.
నెవాడా యూనివర్శిటీ క్యాంపస్‌లో తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రొఫెసర్ విన్సెంట్ పెరెజ్ చెప్పారు. కాల్పుల శబ్దాన్ని విని తాము లోపలకు పరుగెత్తామని ప్రొఫెసర్ చెప్పారు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్శిటీని పోలీసులు ఖాళీ చేయించారు. వర్సిటీకి వెళ్లే రోడ్లను సైతం మూసివేశారు. బ్యాక్‌ప్యాక్‌లతో ఉన్న పలువురు విద్యార్థులను పోలీసులు క్యాంపస్ వెలుపలికి తీసుకెళ్లారు.
లాస్ వెగాస్ క్యాంపసులో 25వేలమంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు చదువుతున్నారు. అయితే, లాస్ వెగాస్‌లో కాల్పులు జరగడం ఇదేం కొత్త కాదు.. 2017వ సంవత్సరంలో లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు హోటల్ నుంచి జరిపిన కాల్పుల్లో 60 మంది దుర్మరణం పాలయ్యారు.