లక్ష్మీ ఇందిరా పాండా (Laxmi Indira Panda)… అతిచిన్న వయస్సులోనే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 14 ఏండ్ల వయసులోనే అజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన వీరనారి. ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో పనిచేసిన ఏకైక ఒడిశా మహిళ ఈమె. సింగపూర్ లో అరెస్టైన ఇండియన్ నేషనల్ ఆర్మీ బృందంలో ఈమెను బ్రిటీష్ వాళ్లు హార్డ్ కోర్ వార్ క్రిమినల్ గా గుర్తించారంటే లక్ష్మి పోరాటం ఎలాంటిదో అర్థం చేసుకోండి.
1930లో మయన్మార్ లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ మయన్మార్ యూనిట్ లో ఈమె తండ్రి ఓ చిన్న ఉద్యోగిగా పని చేశారు. బ్రిటీష్ సైన్యం చేసిన బాంబు దాడిలో తల్లిదండ్రులు మరణించారు. తల్లిదండ్రులు మరణించే నాటికి ఈమె వయసు 14 సంవత్సరాలు. అప్పుడే తాను కూడా ఐఎన్ఏలో చేరాలని అనుకున్నారు.
వయస్సు తక్కువగా ఉండటంతో నిర్వాహకులు నిరాకరించారు. దీంతో ఆ శిబిరం ప్రవేశ ద్వారం వద్ద వేచి చూశారు లక్ష్మి. నేతాజీ రాగానే ఆయన్ని అడ్డుకున్నారు. తనను ఐఎన్ఏలో చేర్చుకోవాలని కోరారు. ఆమె దృఢ సంకల్పాన్ని చూసి ఐఎన్ఏ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత చేర్చుకున్నారు. ఈమెను రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ లోకి తీసుకున్నారు. అక్కడ షూటింగ్, కత్తి సాము, బాంబులు విసరడంపై శిక్షణ ఇచ్చారు.
మొదట్లో ఐఎన్ఏ సభ్యుల కోసం వంటలు వండటం, వాళ్ల గదులను శుభ్రం చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేయించేవారు. ఆ తర్వాత ఆమె పని తీరును చూసి కీలక బాధ్యతలు అప్పగించారు. బ్రిటీష్ తో యుద్ధం సమయంలో ఆమె కొన్ని రోజుల పాటు చెట్ల వేర్లు, ఉడికించిన ఆకులు తిని యుద్ధం చేశారు.
కానీ, భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె సేవలను అప్పటి భారత ప్రభుత్వం గుర్తించలేదు. ఓ ఇంట్లో పని మనిషిగా ఉండి జీవితం వెళ్లదీశారు. 7 అక్టోబర్ 2008లో ఈమె తుదిశ్వాస విడిచారు. 25 అక్టోబర్ 2008న ఆమెకు ప్రభుత్వం రాష్ట్రీయ స్వాతంత్య్ర సైనిక్ సమ్మాన్ అవార్డును ప్రకటించింది.