శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున రన్‌వేపై చిరుతను ఎయిర్‌పోర్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. చిరుత ఇంకా ఎయిర్‌పోర్ట్(Airport) పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు.
చిరుతపులి సంచార విషయం తెలిసి విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30గంటలకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుంచి దూకినట్లు సమాచారం చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.
దీంతో వెంటనే కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతపులితో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డైంది. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, 2019 నవంబరు 27న ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఫారెస్ట్, జూ అధికారులను అక్కడకు రప్పించారు. రెండుగంటల పాటు ముమ్మరంగా గాలించగా అది చిరుత కాదని, అది అడవి పిల్లిగా గుర్తించి ప్రస్తుతం కనిపించింది చిరుతనా? లేక గతంలోలాగే అడవి పిల్లి సంచరిస్తుందా? అనేది తెలియాల్సివుంది.