Leopard: తిరుమలలో జరిగిన విషాదం భక్తులను కలచివేసింది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో అలిపిరి కాలి నడక మార్గంలో వెళ్తున్న ఓ కుటుంబంలోని ఆరేళ్ళ బాలిక లక్షిత చిరుత దాడిలో మృతి చెందింది. తల్లి దండ్రుల వెనుక నడుస్తున్న ఈ చిన్నారిని వేగంగా వచ్చిన చిరుత లాక్కుని పోయినట్టు పోలీసులు తెలిపారు. . కొద్దిసేపటికి తమ చిన్నారి కనబడడం లేదని గ్రహించిన ఆమె తలిదండ్రులు రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేబట్టలేకపోయారు.
చివరకు శనివారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద లక్షిత మృత దేహాన్ని కనుగొన్నారు. తమ చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యుల రోదనలకు అంతు లేకపోయింది. లక్షిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు, అటవీ శాఖ అధికారులు అలిపిరి మార్గం వద్దకు చేరుకొని చిరుత జాడ కోసం యత్నాలు ప్రారంభించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం అని తెలుస్తోంది.
గతంలో కూడా అయిదేళ్ల బాలుడిపై ఓ చిరుత దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈ మార్గంలో వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంతవరకు పగటి వేళ లోనే గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.