విశాఖ అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఈ ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్ బాయ్ నాని హైకోర్టును ఆశ్రయించాడు. కొద్ది రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో కోట్ల రూపాయల విలువ గల చేపలు, 49 బోట్లు బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదానికి యూట్యూబర్ నానియే కారణం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్భందించారని నాని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై అతని స్నేహితులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విశాఖ పోలీసులు చిక్కుల్లో పడినట్లు అయింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విశాఖ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
‘‘తెల్ల పేపర్లపై నాది, నా భార్యది సంతకాలు పెట్టించుకున్నారు. దానిపై తేదీలు కూడా ఏం లేవు. నా దగ్గరకి వచ్చి పిటిషన్ వెనక్కి తీసుకోమన్నారు. లేదంటే విశాఖపట్నంలో నువ్వు తిరగడం చాలా కష్టం అవుతుంది.. తరువాత నువ్వు చాలా బాధ పడతావు అని అన్నారు. అంతే కాకుండా వీడియోలు చేయొద్దు అని, ప్రెస్ వాళ్లకి ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వద్దని చెప్పారు. కానీ, మీకు ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నేను ఇప్పటికీ ముద్దాయిలాగే ఉంటాను. అందుకే నేను నా బాధను ఇప్పుడు చెబుతున్నాను. లేదంటే ప్రజలు కూడా నేనే ఈ ప్రమాదం చేశాను అని అనుకుంటారు. నాకు అస్సలు ఏం తెలియదు. అన్ని రికార్డులు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. నా ఫోన్ ట్రాకింగ్, నేను ఎక్కడకి వెళ్లాను అన్నీ కూడా వాళ్ల దగ్గర ఉన్నాయి. నేను ఏం తప్పూ చేయలేదు. హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను’’ అని మీడియా ముందు వాపోయాడు నాని.