ఆరోగ్యశ్రీ (Aarogya Sri)బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. ఆరోగ్య శ్రీ వర్తించే ఆసుపత్రులకు రూ.1000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్‌గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్‌కు దిగజార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా విపత్తు సమయంలో సాక్షాత్తు సీఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినప్పుడే జగన్‌రెడ్డి పనితనమేమిటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ఈనెల 27 నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి అద్దం పడుతోందన్నారు.
చేతగాని పాలనతో ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రిని చూసి కాంట్రాక్టర్లు పరారయ్యారని లోకేశ్ అన్నారు. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూశామని లోకేశ్ గుర్తుచేశారు.