చంద్రబాబు (Chandra Babu) అరెస్టుకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలాగా ‘బాబుతో నేను’ అనే కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకు వెళ్తామన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జగన్ రెడ్డి రిమాండ్కు పంపించారని మండిపడ్డారు. తాము న్యాయాన్ని నమ్ముకుని జనంలోకి వెళ్తామని చెప్పారు.
రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. జైల్లో చంద్రబాబు భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదే జైలులో మావోయిస్టులు, గంజాయి కేసు నిందితులు కూడా ఉన్నారన్నారు. ఇటీవల జైలు లోపల కొందరు డ్రోన్ ఆపరేట్ చేశారని అన్నార. జైలుపై దాడి చేస్తామంటూ ఇటీవల కొందరు ఏకంగా జిల్లా ఎస్పీకే లేఖ రాశారని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసు వ్యవస్థను వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తున్నారన్న ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై దర్యాప్తు జరిపి సర్వీసు నుంచి తప్పిస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో దొంగ కేసుల విషయాన్ని రాష్ట్రపతికి వివరించామన్నారు.
చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరిస్తామన్నారు. దీని కోసం జనసేనతో కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీ చేసే సూచనల మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. టీడీపీ పోరాటం ఆగలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో నిరసన చేపడతామని చెప్పారు.
గత 28 రోజులుగా చంద్రబాబును రిమాండ్లో ఉంచారన్నారు. అయినప్పటికీ చంద్రబాబు అధైర్యపడలేదన్నారు. పోరాటం ఆపవద్దని, శాంతియుతంగా పోరాడాలని తనతో చెప్పారని పేర్కొన్నారు. న్యాయం కాస్త ఆలస్యం కావచ్చు గానీ విజయం మాత్రమే తమదేనన్నారు. న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా అందరూ సంఘీభావం తెలపాలన్నారు.
శనివారం రాత్రి 7 గంటల నుంచి 5నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేయాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి, మొబైల్ ఫ్లాష్లైట్లతో సంఘీభావం తెలపాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించామన్నారు. ఇతర జాతీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి పరిస్థితి వివరించామని తెలిపారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని ఇతర పార్టీల నేతలు తనతో అన్నారన్నారు.
‘పోలవరంపై మాట్లాడినందుకు చంద్రబాబును రిమాండ్కు పంపించారన్నారు.. స్కిల్ డెవలప్ కేసులో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారన్నారు. ఆ తర్వాత రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.27 కోట్ల అవినీతి అని మరోసారి మాట మార్చారని మండిపడ్డారు. కక్ష సాధింపుతో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్కు పంపారుని ఫైర్ అయ్యారు.