ఆగిఉన్న లారీ (Lorry) లో ఉన్నట్టుండి మంటలు (Fire) చెలరేగాయి. చూస్తుండగా.. క్షణాల్లో అవి తీవ్రం అయ్యాయి. దీంతో లారీతో పాటు అందులో ఉన్న వస్తువులు మంటకు ఆహుతయ్యాయి. శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పలాస (Palasa) మీదుగా బరంపురం (Brahmapur) వైపు వెళ్తున్న లారీ.. సోంపేట మండలం కొర్లం (Korlam) సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై పక్కకు నిలిపి ఉంది. అయితే.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్ అందులోనే ఉన్నారు. మంటలను గమనించి వెంటనే బయటకు దూకారు. లేకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేది.
మంటలు వేగంగా వ్యాపించడంతో లారీ దగ్ధమైంది. స్థానికులు పోలీసులకు (Police), ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు స్పాట్ కు చేరుకున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసపడడంతో ఎవరూ లారీ దగ్గరకు వెళ్లకుండా చూసుకున్నారు పోలీసులు. ఫైర్ సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపు చేశారు.
కోయంబత్తూరు నుంచి కోల్ కతా (Kolkata) వెళ్తోంది ఈ లారీ. ఇందులో టీ పొడికి సంబంధించిన లోడ్ ఉందని డ్రైవర్, క్లీనర్ చెప్పారు. అయితే.. మంటలు విపరీతంగా వ్యాపించడంతో ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయా? అని పోలీసులు వారిని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.