Luna 25 Launch : చంద్రునిపై పరిశోధనల కోసం నిర్విరామంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా రష్యా చేబట్టిన లూనా 25 (Luna-25) మిషన్ లాంచ్ విజయవంతమైంది. సుమారు 5 దశాబ్దాల తరువాత చంద్రునిపై అధ్యయనానికి రష్యా నడుం బిగించింది. ఈ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ ప్రయోగించిన లూనా-25 శుక్రవారం తెల్లవారు జామున 2.10 గంటలకు వోస్తోచ్నీ కాస్మొడ్రోమ్ నుంచి నింగిలోకి దూసుకుపోయింది. 5 రోజుల్లోనే ఇది సుమారు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి ఆర్బిట్ లోకి చేరనుంది.
చంద్రుని ఉపరితలాన్ని చేరేముందు వంద కిలోమీటర్ల ఆర్బిట్ లో ఇది మూడు నుంచి 7 రోజుల్లో ల్యాండ్ కావచ్చునని భావిస్తున్నారు. అంటే లూనా-25 ఈ నెల 23 న చంద్రుని దక్షిణ ధృవంలో అడుగు పెట్టవచ్చు..అయితే అదే రోజున ఇస్రో చేబట్టిన చంద్రయాన్-3 కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి . దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తుండగా రష్యా చేబట్టిన లూనా-25 దీనికి పోటీనిస్తోంది.
ఈ సౌత్ పోల్ లో ఐస్ ఎక్కువగా ఉండవచ్చునని, తదుపరి అంతరిక్ష పరిశోధనల కోసం ఆక్సిజన్ ని, ఇంధనాన్ని సేకరించడానికి దీన్ని వినియోగించుకోవచ్చునని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. చంద్రుని దక్షిణ ధృవంపై పరిశోధనల కోసం ఇండియా, రష్యా పోటీ పడుతున్నాయని భావిస్తున్నారు.
సాఫ్ట్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని చాటుకోవడంతో బాటు లూనా-25.. చంద్రుని ఉపరితలంపై మట్టి నమూనాలను విశ్లేషిస్తుందని, దీర్ఘ కాలిక శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తుందని రోస్ కాస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా చంద్రయాన్-3 మిషన్ ఆర్బిటర్ ను, ల్యాండర్ ను, రోవర్ ను క్యారీ చేస్తున్నట్టు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలో లూనా-25 సుమారు ఏడాది పాటు పరిశోధనలు చేయవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే చంద్రుని ఉపరితలం మీద చంద్రయాన్-3 కి చెందిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 14 రోజుల పాటు పని చేయనున్నాయి.