జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి పోలీస్ అవతారమెత్తాడు. తాను పోలీసునని నమ్మిస్తూ బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్ల వద్ద వసూళ్లకు తెరలేపాడు. చివరకు ఈ నకిలీ పోలీసు బండారం బయటపడింది. మాదాపూర్(Madapur) ఎస్వోటీ పోలీసులు(SOT Police) అతన్ని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. గుడి మల్కాపూర్(Gudi malkapur)కు చెందిన మరికొండ సాయికిరణ్ తేజ(Marikonda Saikiran Teja) కొరియోగ్రాఫర్(Choreographer)గా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు వచ్చే ఆదాయం సరిపోక దొడ్డిదారిన డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా పోలీసు అవతారమెత్తాడు.
కొన్నిరోజులుగా క్రైం డిటెక్టివ్‌నని నకిలీ ఐడీని చూపుతూ బ్యూటీపార్లర్ల యజమానులను బెదిరిస్తున్నాడు. వారి వద్ద వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో సాయికిరణ్ గతరాత్రి రాయదుర్గం ఫార్చ్యూన్ అపార్ట్ మెంట్లోని 5వ ఫ్లోర్లో స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్ యజమానిని బెదిరించి రూ.10వేలు తీసుకుని బయటకు వస్తున్నాడు.
ఈ క్రమంలో సాయికిరణ్‌ను ఎస్వోటీ టీమ్ అదుపులోకి తీసుకుంది. అతన్ని రాయదుర్గం పోలీసులకు అప్పగించి విచారణ చేపట్టారు. అతడి వద్ద నుంచి రూ.10వేల నగదు, ఒక మొబైల్ ఫోన్, హోండా యూనికాన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.