రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియకి నేడు చివరి రోజు.. కాగా ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. ఈ క్రమంలో లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ (BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువలను ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad) లోక్‌సభ స్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేసిన మాధవీలత.. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లని పేర్కొన్నారు. స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు. మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. తన పేరిట విరించి లిమిటెడ్, వినో బయోటెక్‌లలో రూ.8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు వివరించారు.
అదేవిధంగా తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు, అన్‌లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్‌లలో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. అలాగే ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 3.9 కిలోలు తన పేరుమీద, 1.11 కిలోల బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు చెప్పుకొచ్చారు..
అయితే, ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు సొంతంగా లేవని పేర్కొనడం గమనార్హం. మొత్తంగా రూ.218 కోట్లుగా వెల్లడించారు. మరోవైపు ఒక క్రిమినల్ కేసు కూడా తనపై ఉన్నట్లు మాధవీలత ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక చదువు విషయానికి వస్తే.. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు..